పీవోకేను స్వాధీనం చేసుకున్న రోజున బీజేపీలో చేరుతా : జేసీ దివాకర్ రెడ్డి
టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంజీ జేసీ దివాకర్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్ స్వాధీనం చేసుకున్న రోజున భారతీయ జనతా పార్టీలో చేరుతానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంటే ప్రధాని మోడీ సారథ్యంలోని మోడీ సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ కల సాకారమైన రోజున ఆయన బీజేపీ చేరడం ఖాయమని ఆయన అనచరులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను జేసీ ఆదివారం అనంతపురంలో కలిశారు. దీంతో జేసీ కమలం తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. జాతీయ పార్టీలతోనే దేశ పురోగతి సాధ్యమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ మార్పుపై సంకేతాలు ఇచ్చినట్టుగానే భావించారు.
దీనిపై జేసీ తనదైనశైలిలో స్పందించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను బీజేపీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న రోజున ఆ పార్టీలో చేరుతానని స్పష్టంచేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా తగ్గిపోతూ ఉందన్నారు. అయితే, ప్రాంతీయ పార్టీలు కొనసాగే వరకు తాను టీడీపీలోనే ఉంటానని జేసీ తేల్చి చెప్పారు.
మరోవైపు, ఏపీకి మూడు రాజధానుల అంశంపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటే అమరావతి ఉండాలని, లేదంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రాయలసీమలో కలిపి కొత్తగా గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలా కుదరని పక్షంలో కర్నూలు జిల్లాను తెలంగాణలో కలిపేయాలని సూచించారు. అయినా, ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.