అరే... పేర్ని నాని నీ బ్యాటరీ సరిగ్గా లేదు... పవన్ మంచోడు కాబట్టే.. : జేసీ ప్రభాకర్ రెడ్డి (Video)
మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరే పేర్ని నాని నీ బ్యాటరీ సరిగ్గా లేదురా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపం.. ఆ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ మంచోడు కాబట్టే ఐదు నెలలకే రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారని అన్నారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంచితనంతో తమ చేతులు కట్టేశారని జేసీ అన్నారు.
కక్షసాధింపు చర్యలతో తన ఇంటి ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించిన మాజీ మంత్రి పేర్ని నానిపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు వయసు కూడా చూడకుండా అర్థరాత్రి అరెస్టు చేశారని, ఆ రోజు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఏడవడం మీకు వినిపించలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని పలుమార్లు చెప్పావు. ఆయన మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఈ రోజు ఆయన అనుకుంటే మీరెక్కడుంటారో తెలుసుకోవాలని జేసీ అన్నారు. తనను 120 రోజులు జైల్లో పెట్టారని, తనపై కేసులు పెట్టినప్పుడు తనకు భార్య, కోడుకు, కోడలు లేరా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆడవాళ్ల గురించి మాట్లాడుతారా అంటూ పేర్ని నానిపై ఫైర్ అయ్యారు.
మచిలీపట్నంలో 1.12 ఎకరాల్లో నిర్మించిన గోదాము మీది కాదా? పేదల బియ్యం అమ్ముకుంటున్నావంటూ మాజీ మంత్రిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి మీడియా ముందు వచ్చి మాట్లాడితే చరిత్ర బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. తనపై గతంలో అక్రమ కేసులు బనాయించారని, అప్పటి నుంచి గడ్డం పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. వాటి నుంచి బయటపడిన రోజు గడ్డం తీసేస్తానన్నారు.