మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (09:58 IST)

ప్రభుత్వంపై విమర్శలు : నోటీసులు జారీచేస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే వారు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ.. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కోణంలోనే ప్రభుత్వం యంత్రాంగం ఉంది. ఇందులోభాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలను ఒక్కొక్కరిగా గుర్తించి పోలీసులు నోటీసులు జారీచేస్తున్నారు. 
 
తాజాగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో ఇటీవల పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుపడ్డాయి. ఈ డ్రగ్స్ విలువ రూ.21 వేల కోట్లు. ఈ వ్యవహారానికి లింకులు ఏపీలోని విజయవాడ నగరంలో ఉన్నట్టు బయటపడడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 
 
ఇందులోభాగంగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ డ్రగ్స్ వ్యవహారంతో ప్రభుత్వానికి సంబంధాలున్నాయని ప్రతిపక్ష టీడీపీ తొలి నుంచీ ఆరోపిస్తోంది.
 
ఈ క్రమంలో ధూళిపాళ్ల కూడా ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. దీంతో కాకినాడ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో కోరారు. 
 
విచారణకు హాజరై ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని సూచించారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల  నివాసానికి గురువారం వచ్చిన కాకినాడ పోలీసులు నోటీసులు అందజేశారు.