15న నరసరావుపేటలో కామధేనుపూజ :టిటిడి
ధర్మప్రచారంలో భాగంగా జనవరి 15వ తేదీన గుంటూరు జిల్లా నరసరావుపేటలో కామధేనుపూజ (గోపూజ) నిర్వహించనున్నట్టు టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో కామధేనుపూజ ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఇతర పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని, ఇందుకు కావాల్సిన పూజాసామగ్రి తదితరాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని సూచించారు.
హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా జనవరి 15న తెలుగు రాష్ట్రాల్లో గోపూజ యథావిధిగా జరుగుతుందన్నారు. గోపూజ ప్రాశస్త్యంపై ఎస్వీబీసీ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ రూపొందించాలని ఆదేశించారు. కామధేనుపూజకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమీక్షలో టిటిడి బోర్డు సభ్యులు గోవిందహరి, జెఈవో పి.బసంత్‌కుమార్, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్, ఎస్ఇలు వేంకటేశ్వర్లు, జగదీశ్వర్‌రెడ్డి, టివి.సత్యనారాయణ, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి పాల్గొన్నారు.