బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (22:39 IST)

టిటిడికి రూ.2.54 కోట్లు విరాళం

వైకుంఠ ఏకాద‌శి నాడు శుక్ర‌వారం టిటిడికి రూ.2.54 కోట్లు విరాళంగా అందాయి. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు  కుమార‌గురు త‌న సొంత ప్రాంత‌మైన త‌మిళ‌నాడు రాష్ట్రం ఊలందూరుపేట‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య నిర్మాణం కోసం  ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. 
 
అదేవిధంగా, హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ ఇంద్ర‌కుమార్ అనే భ‌క్తుడు టిటిడి విద్యాదాన ట్ర‌స్టుకు రూ.1.08 కోట్లు, ప్రాణ‌దాన ట్ర‌స్టుకు రూ.54 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. ఈ మేర‌కు దాత‌లు విరాళాల డిడిల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో టిటిడి ఛైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు.
 
భ‌క్తుల‌కు వైకుంఠ ఏకాద‌శి శుభాకాంక్ష‌లు
శ్రీ‌వారి భ‌క్తుల‌కు వైకుంఠ ఏకాద‌శి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం ఉద‌యం ఆల‌యం వెలుప‌ల ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడారు. 
 
ఈ ప‌ర్వ‌దినం నాడు విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం నిర్ణీత స‌మ‌యానికంటే ముందుగానే ముగించి, సామాన్య భ‌క్తుల‌కు త్వ‌ర‌గా స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభించామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించి భౌతిక‌దూరం పాటిస్తూ శ్రీ‌వారిని ద‌ర్శించుకోవాల‌ని కోరారు. ఎక్కువ మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించాల‌నే స‌దుద్దేశంతో మొద‌టిసారిగా ప‌దిరోజుల పాటు వైకుంఠ ద్వారం తెర‌చి ఉంచుతున్న‌ట్టు తెలిపారు.
 
నాద‌నీరాజ‌నం వేదిక‌పై భ‌గ‌వ‌ద్గీత అఖండ ‌పారాయ‌ణం
వైకుంఠ ఏకాద‌శితోపాటు విశేష‌మైన గీతాజ‌యంతిని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం నాడు తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం జ‌రిగింది. 
 
ఉద‌యం 6 గంట‌ల నుండి దాదాపు 4 గంట‌ల పాటు ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 అధ్యాయాల్లో గ‌ల 700 శ్లోకాల‌ను వేద‌పండితులు పారాయ‌ణం చేశారు. భ‌క్తులు ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 
 
అంత‌కుముందు టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను వీనుల‌విందుగా ఆల‌పించారు. శ్రీ కృష్ణార్జున వ్యాఖ్యానం చేశారు. కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ భ‌జ‌నతో ఈ కార్య‌క్ర‌మం ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం విసి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి, ధ‌ర్మగిరి వేద విజ్ఞాన‌పీఠం ప్రిన్సిపాల్  కెఎస్ఎస్‌.అవ‌ధాని, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్‌, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో బాలాజి, వేద పండితులు, భ‌క్తులు పాల్గొన్నారు.