శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:38 IST)

సెప్టెంబర్ 4వ తేదీన కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభం

సెప్టెంబర్ 4వ తేదీన కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. వైసీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

టీడీపీ నేతలైన కేశినేని నాని, బోండా ఉమా ఐదు నెలలకు ఒకసారి బయటకు వస్తారంటూ ఎద్దేవా చేశారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం వారి హయాంలో జరిగితే అప్పుడే ప్రారంభం చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో పేద ప్రజల కోసం పని చేయాల్సిన చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ జూమ్ సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల అనుభవం అంటూ చెప్పుకునే చంద్రబాబు, లోకేష్ చౌదరి హైదరాబాద్‌లో నివాసం ఉండటాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.

కోవిడ్ సమయంలో సైతం జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పై హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.