మనం పల్లకీలు మోయడమేనా? మన జాతికి స్వాతంత్రం రాలేదన్న ముద్రగడ
కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఎన్నాళ్ళు మనం పల్లకీలు మోయాలంటూ బీసీ, కాపు, దళిత సోదరులకు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు.
బీసీ, కాపు, దళిత సోదరులకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దిశానిర్దేశం చేసే ప్రయత్నం మరోసారి చేశారు. ఆయా వర్గాలకు బహిరంగ లేఖ రాశారు. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన జాతి వారికి రాలేదు. తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి? ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు రాజ్యాధికారం అనుభవించకూడదో ఆలోచన చేయాలి. మన జాతుల జీవితాలు పల్లకీలు మోయడానికేనా? ఎన్నటికీ పల్లకిలో కూర్చునే అవకాశం తెచ్చుకోలేమా? అని ముద్రగడ ఘాటుగా ప్రశ్నించారు.
తాము ఎవరికీ వ్యతిరేకం కాదని... అలాగే ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేట్ జాగీరు కాదంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి ముద్రగడ తాను కాపు ఉద్యమం నుంచి విరమించుకుంటున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ, ఈసారి ఆయన బహిరంగ లేఖతో మళ్ళీ ఏపీ పాలిటిక్స్ లోకి రావడంతో ఆయన మరో రాజకీయ ఉద్యమానికి సిద్ధం అవుతున్నారని ఆయా వర్గాలు భావిస్తున్నాయి.