యువతిపై అత్యాచారం : ఇద్దరు ముద్దాయిలకు 20 యేళ్ల జైలు
ఓ యువతిపై అత్యాచారం జరిపిన కేసులో ముద్దాయిలుగా తేలిన ఇద్దరికి 20 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కరీంనగర్ జిల్లా ఐదో అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుపై బాధితురాలు సంతోషం వ్యక్
ఓ యువతిపై అత్యాచారం జరిపిన కేసులో ముద్దాయిలుగా తేలిన ఇద్దరికి 20 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కరీంనగర్ జిల్లా ఐదో అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుపై బాధితురాలు సంతోషం వ్యక్తం చేసింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన యువతి పెద్దపల్లిలోని తన సోదరి ఇంటికి వెళ్లేందుకు ఓ యువతి బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చి పాట్నా ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. రైలు పెద్దపల్లిలో ఆగదని తెలుసుకుని రామగుండంలో దిగింది. మరో రైలు కోసం విశ్రాంతి గదిలో వేచివుండగా, రామగుండంలోని భరత్‌నగర్‌కు చెందిన మహ్మద్ సమీర్ (20) అలియాస్ అఖిల్ అక్కడికి వచ్చి ఆమెతో మాట కలిపి దగ్గరయ్యాడు.
ఆ తర్వాత సమీపంలోని పార్కు ఉందని అక్కడ కూర్చుందామని తీసుకువెళ్లాడు. యువతికి తెలియకుండా సమీర్ తన స్నేహితునికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు. దీంతో అక్కడికి చేరుకున్న రాజ్‌కుమార్ (22) అనే యువకుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయడంతో సమీపంలోని వారు అక్కడికి వచ్చేలోపు వారిద్దరు అక్కడ నుంచి పారిపోయారు.
యువతి ఫిర్యాదు మేరకు రామగుండం పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఉదయ్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో సాక్షులను విచారించిన కరీంనగర్ జిల్లా ఐదో అదనపు సెషన్స్ న్యాయమూర్తి నాగరాజు శుక్రవారం తుదితీర్పును వెలువరించారు.
ఈ తీర్పులో అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయిలుగా తేలిన ఇద్దరికీ 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. 2013 ఏప్రిల్ 18వ తేదీన బెల్లంపల్లికి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది.