శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (12:34 IST)

యలమందలో కత్తి మహేష్ అంత్యక్రియలు

చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో కత్తి మహేష్ అంత్యక్రియలు జరిగాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్... చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య సోనాలితో పాటు ఓ కుమారుడు ఉన్నారు. 
 
నెల్లూరు జిల్లాలో ముందు వెళుతున్న కంటైనర్ లారీని కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తల, కళ్లకు తీవ్రగాయాలు కావడంతో ఆపరేషన్ నిర్వహించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న ఆయన శనివారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, 2014లో 'మిణుగురులు' చిత్రానికి సహ రచయితగా వ్యవహరించారు. 'పెసరట్టు' చిత్రంతో దర్శకుడిగా మారారు. 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట', 'క్రాక్‌' తదితర సినిమాల్లో నటించారు. మా టీవీ నిర్వహించే 'బిగ్‌బాస్‌' రియాలిటీ షోలోనూ పాల్గొని అలరించారు. ఆయన మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.