మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. మదనపల్లి ఫైళ్ళ దహనం కేసులో ఆయన ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రధాన కుట్రదారుడుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. గత ఆరు నెలలుగా ముందస్తు బెయిలుపై ఉండగా, ఆ బెయిల్‌ను రద్దు చేయించిమరీ సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు వద్ద ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉన్నట్టు వచ్చిన పక్కా సమాచారంతో సిట్ పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.
ఆయన పెద్దగొట్టిగల్లులో కళ్యాణ మండపం నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. దీంతో కళ్యాణ మండపం అద్దెకు కావాలంటూ సీఐడీ డీఎస్పీ కొండయ్య నాయుడు బృందం ఆరా తీస్తూ మాధవరెడ్డిని ఆచూకీ గుర్తించి, వలపన్ని అరెస్టు చేశారు. ఆ సమయంలో మాధవరెడ్డి తన మొబైల్ ఫోన్లను నీటిలో పడేసేందుకు ప్రయత్నించగా, చాకచక్యంగా డీఎస్పీ పట్టుకుని తిరుపతికి తరలించారు. ఆయన నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గత యేడాది జూలై 21వ తేదీన మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనలో ప్రధాన కుట్రదారుడుగా మాధవరెడ్డి ఉన్న విషయం తెల్సిందే.