శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 1 జులై 2018 (17:42 IST)

రాహుల్ గాంధీ సూచన మేరకే నల్లారికి ఆహ్వానం.. తుది నిర్ణయం ఏమిటో?

ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్ చాందీ ఆదివారం హైదరాబాదులోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి చెందిన

ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్ చాందీ ఆదివారం హైదరాబాదులోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.


క్రియాశీలక రాజకీయాలకు దూరంగా వున్న కిరణ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాందీతో భేటీ ఆ వార్తలను నిజం చేసేలా వున్నాయని ప్రచారం సాగుతోంది. 
 
ఈ భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తాను కాంగ్రెస్‌లో చేరుతున్నాననేవి కేవలం వార్తలు మాత్రమేనని... సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానన్నారు. ఉమెన్ చాందీ మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే కాకుండా, యావత్ దేశానికే కీలక సమయమని చెప్పారు. విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ను వీడిన నేతలందరినీ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఇదే కోవలో పార్టీలోకి ఆహ్వానించామని.. కానీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే ఇక నిర్ణయం తీసుకోవాలని ఉమెన్ చెప్పారు.
 
మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ వీడిన నేతలను మళ్లీ ఆహ్వానించాలంటూ చెప్పారని... ఆయన సూచన మేరకే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించామని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు తెలిపారు. ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటానని కిరణ్ చెప్పారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడేనన్నారు.