శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: గురువారం, 28 జూన్ 2018 (19:11 IST)

తమ్ముడిని సైకిల్ ఎక్కించి అన్న ఏం చేయబోతున్నారో తెలుసా..?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ భవితవ్యంపై నాలుగేళ్లుగా చర్చ జరుగుతోంది. రాజశేఖర్‌ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ముఖ్యమంత్రి పీఠంపై తొలుత రోశయ్యను కూర్చోబెట్టినా… ఆయన సవ్యంగా రాష్ట్రాన్ని నడపలేకపోయారు. ఆయనే స్వయంగా ఆ పదవి నుంచి తప్పుక

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ భవితవ్యంపై నాలుగేళ్లుగా చర్చ జరుగుతోంది. రాజశేఖర్‌ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ముఖ్యమంత్రి పీఠంపై తొలుత రోశయ్యను కూర్చోబెట్టినా… ఆయన సవ్యంగా రాష్ట్రాన్ని నడపలేకపోయారు. ఆయనే స్వయంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత కాంగ్రెస్‌ అధిష్టానం నల్లారిని పీఠం ఎక్కించింది. ముఖ్యమంత్రిగా ఉంటూనే… రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సభలు నిర్వహించారు కిరణ్‌. ఆ తరువాత జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఇదంతా కాంగ్రెస్‌ అధిష్టానం డైరెక్షన్‌లోనే సాగిందన్న విమర్శలున్నాయి. 
 
ఒకవేళ నిజంగానే సమైక్యాంధ్ర సెంటిమెంటు జనంలో ఉంటే… దానికి అనుకూలంగా ఓట్లు వేస్తే తమవాడి చేతిలోనే రాష్ట్రం ఉంటుందన్న వ్యూహంతో కిరణ్‌ కుమార్‌రెడ్డితో సమైక్యాంధ్ర పార్టీ పెట్టించి కథ నడిపించారని అంటారు. అయితే… అలాంటి ఫలితాలు రాలేదు. ఒక్క సీటు కూడా కిరణ్‌ పార్టీ గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్‌ నామరూపాలు లేకుండాపోయింది. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
 
కిరణ్‌ బిజెపిలో చేరుతారన్న ప్రచారమూ జరిగింది. ఇంతలో అనూహ్యంగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి సోదరుడు కిశోర్‌ కుమార్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కిరణ్‌ కూడా అటువైపు మొగ్గుతారన్న ప్రచారం జరిగినా…. ఆయన గురించి తెలిసినవారు ఎట్టిపరిస్థితుల్లోనూ టిడిపిలో చేరబోరని చెబుతూ వచ్చారు. ఇదిలావుండగా రెండు రోజుల నుంచి కిరణ్‌ మళ్లీ తెరపైకి వచ్చారు. 
 
ఆయన తిరిగి సొంత గూటికి చేరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్‌ పెద్దలు కొందరు కిరణ్‌ను కలిసి పార్టీలోకి రావాలని కోరుతున్నారు. వచ్చే నెలలో సోనియా గాంధీని, రాహుల్‌ గాంధీని కలవనున్నట్లు చెబుతున్నారు. కిరణ్‌ వస్తే పార్టీ బలోపేతం అవుతుందని కాంగ్రెస్‌ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. కిరణ్‌ కూడా అటువైపే మొగ్గుతున్నట్లు కనిపిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న ఆగ్రహం మెల్లగా చల్లబడుతుందన్న నమ్మకం వారిలో కలగడటంతో బలమైన నాయకత్వం ఉంటే మళ్లీ పుంజుకోవడం పెద్ద కష్టం కాదన్న భావన ఆ పార్టీ నాయకుల్లో ఉంది.
 
తమ్ముడిని సైకిల్‌ ఎక్కించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి… తను మాత్రం హస్తంలో చేరేందుకు సిద్ధమయ్యారనే చర్చ జరుగుతోంది. ఇందులో రెండు మూడు అంశాలున్నాయి. కిరణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబం ఎప్పటి నుంచో కాంగ్రెస్‌తో ఉంది. ప్రాథమికంగానే మరో పార్టీలో చేరడం కష్టం. అంతేకాకుండా అక్కడ తగిన ప్రాధాన్యత ఉండదు. 
 
ఇక బిజెపి గత ఎన్నికలంత బలంగా లేదు. 2019లో ఆ పార్టీ అధికారంలోకి రావడం అంత సులభంగా కనిపించడం లేదు. దేశ వ్యాపితంగా కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకుంటోంది. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌-టిడిపి కలిసి సాగే సూచలూ కనిపిస్తున్నాయి. ఏవిధంగా చూసినా కాంగ్రెస్‌లో ఉంటేనే తగిన ప్రాధాన్యత లభిస్తుందని కిరణ్‌ భావిస్తున్నట్లు సమాచారం. వ్రతం చెడకుండానే ఫలితం దక్కే మార్గం ఇదేనని ఆయన భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.