గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (15:22 IST)

అల్లుడు భాగోతం అత్తే చెప్పాలంటున్న లక్ష్మీపార్వతి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపా మహిళా నేత లక్ష్మీపార్వతి తనదైనశైలిలో సెటైర్లు వేశారు. టీడీపీ నేతల ఇళ్లు, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టిన అంశంపై ఆమె స్పందించారు. 
 
"అల్లుడి భాగోతం అత్తే చెప్పాలి మరి... ఎన్టీఆర్ ను అమాయకుడ్ని చేసి మోసగించాడు. ఆ దుష్టుడి విధానాలు ఇప్పటికీ మారలేదు. అబద్ధానికి, అతడికి అవినాభావ సంబంధం ఉంది. కొడుకు అసమర్థుడు అనుకుంటే అతడికి అవినీతి, అబద్ధాలతో పాటు తాజాగా తిట్టడం కూడా నేర్పించాడు. అదీ చంద్రబాబు సంస్కారం" అంటూ ధ్వజమెత్తారు.
 
అంతేకాదు, చంద్రబాబు దీక్ష శిబిరంపై సెటైర్ వేశారు. "ఇవాళ అల్లుడి నిరాహార దీక్ష శిబిరం పక్కనుంచే వచ్చాను. అక్కడంతా బిర్యానీ పొట్లాలు, డబ్బుల గురించిన మాటలే వినిపించాయి. మధ్యలో ఓ తెర కూడా కట్టారు. బహుశా తినడం ఎవరూ చూడకూడదనేమో!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. కాగా, ప్రస్తుతం లక్ష్మీపార్వతి తెలుగు అకాడెమీకి అధ్యక్షురాలిగా ఉన్న విషయం తెల్సిందే.