శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (08:38 IST)

సెప్టెంబర్ 1న 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' ప్రారంభం.. మహిళలు, చిన్నారులకు వరం

పేద కుటుంబాలకు చెందిన గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ఫ్లస్ కార్యక్రమాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీల పరిధిలో 30,16,000 మందికి రూ.1863.11 కోట్ల లబ్ధి చేకూరే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. సెప్టెంబర్ 1న ఈ పథకం సీఎం చేతుల మీదుగా ప్రారంభంకానుందని తెలిపారు.

వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ద్వారా మైదాన ప్రాంతాల్లోని 47,287 అంగన్‌వాడీల పరిధిలో 26.36 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,555.56 కోట్లతో పౌష్టికాహారం పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ఫ్లస్ కార్యక్రమం ద్వారా 77 గిరిజన మండలాల్లోని 8,320 అంగన్ వాడీల పరిధిలో 3.8 లక్షల మంది లబ్ధిదారులకు రూ.307.55 కోట్లతో పౌష్టికాహారం పంపిణీ చేయనున్నారు.

అదే విధంగా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం, నెలవారి ఇంటికి పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వత్రా సంసిద్ధమైంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో దాదాపు 2,16,000 మంది గర్భవతులు, బాలింతలు, 3-6 సంవత్సరాల వయస్సు పిల్లలకు  ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయలతో సాంబారు,

కోడి గ్రుడ్డు, 200 మి.లీల పాలు అందించనున్నారు. అదే విధంగా నెలవారీ ఇంటికిచ్చే పౌష్టికాహారంలో భాగంగా ప్రతి నెలా 66 వేల మంది  గర్భవతులు, బాలింతలకు మల్టీ గ్రైన్ ఆటా 2 కేజీ, బెల్లం 500 గ్రాములు, వేరుశనగ చిక్కి 500 గ్రాములు, ఎండు ఖర్జూరం  500 గ్రాములు, రాగి/ సజ్జ/జొన్న పిండి 500 గ్రాములు,

1.64 లక్షల మంది 6-36 నెలల పిల్లలకు బాలామృతం 2.5 కేజీలు, 30 కోడి గ్రుడ్లు, పాలు 6 లీటర్లు తో కూడిన పౌష్టికాహారం ఇంటికి పంపిణీ చేయనున్నారు. మైదాన ప్రాంతాల్లోని 12.86 లక్షల మంది గర్భవతులు, బాలింతలు, 3-6 సంవత్సరాల వయస్సు పిల్లలకు ప్రతిరోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, కోడి గ్రుడ్డు, చిన్నపిల్లలకు 100 మి.లీలు పాలు, పెద్దవారికి 200 మి.లీల పాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించనున్నారు.

ప్రతి నెలా 5.8 లక్షల మంది  గర్భవతులు, బాలింతలకు రాగి పిండి 1 కేజీ, బెల్లం 250 గ్రాములు, వేరుశనగ చిక్కి 250 గ్రాములు, ఎండు ఖర్జూరం  250 గ్రా. సజ్జ/జొన్న పిండి 250 గ్రా. అటుకులు 1 కేజీ, 13.5 లక్షల మంది 6-36 నెలల పిల్లలకు బాలామృతం  2.5 కేజీలు, కోడి గ్రుడ్లు, 25 గ్రుడ్లు, పాలు 5 లీటర్లు తో కూడిన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ఇంటికి పంపిణీ చేయనుంది. 

గత ప్రభుత్వం ప్రతి లబ్దిదారునికి సగటున రూ.210 మాత్రమే ఖర్చు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతలకు రూ.1100లు, 3-6 సం. ల పిల్లలకు రూ.553లు, 6-36 నెలల చిన్నారులకు రూ.620లు ఖర్చు చేస్తోంది.

అదే విధంగా మైదాన ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతలకు రూ.850లు, 3-6 ఏళ్ల వయస్సు పిల్లలకు రూ.350, 6-36 నెలల పిల్లలకు నెలకు రూ.412లు ఖర్చు చేస్తోంది. అదే విధంగా గత ప్రభుత్వం ఐదేళ్లలో  గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడానికి రూ.2761.23 కోట్లు ఖర్చు చేయగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.1076.23 కోట్లు ఖర్చు చేసింది.

ఈ  ఏడాది ఇప్పటివరకు మరో రూ.1863.11 అంటే రెండేళ్లలో ఆ మొత్తాన్ని ఖర్చు చేసిందన్నారు. అంటే గత ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.1000 కోట్లు ఖర్చుచేసిందన్నారు. గతంలో నెలవారీ ఇంటికి ఇచ్చే పౌష్టికాహారం కేవలం రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు మాత్రమే ఇచ్చేవారు.

కానీ ఈ ప్రభుత్వం అనిమియా తో సంబంధం లేకుండా లబ్దిదారులందరికీ ఇవ్వడం విశేషం.గతంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు మాత్రమే పాలు, గుడ్లు ఇచ్చే వారు. కానీ వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం క్రింద 3 నుండి 6 సం. ల పిల్లలందరికీ ప్రతి రోజు పాలు, గ్రుడ్లు అందించి వారి ఆరోగ్యాన్ని మరింత ధృడంగా చేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టిస్తుంది.