మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (07:15 IST)

ప్రజాస్వామ్యంలో ఉన్నామా...నిరంకుశ పాలనలో ఉన్నామా?.. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు

బ్రిటీష్ పాలనలో కూడా రైతులకు సంకెళ్లు వేయలేదని, నేటి దృతరాష్ట్ర పాలనలో రైతులకు సంకెళ్లు వేయడం సిగ్గుచేటని, అరెస్టు చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలని అమరావతి పరిరక్షణ సమితి జెఎసి కన్వీనర్ ఎ.శివారెడ్డి అన్నారు.

రాజధాని గ్రామం కృష్ణాయపాలెం దళిత, బిసి సోదరులపై అక్రమంగా సంకెళ్లు వేసి తీవ్రంగా అవమానపరచినందుకు నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ లోని ఎంఆర్ వో కార్యాలయం ముందు గురువారం నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జెఏసీ కన్వీనర్ శివారెడ్డితో పాటు, తేదేపా నాయకులు వర్ల రామయ్య, జనసేన నాయకులు పోతిన మహేష్, ఎంఆర్ పిఎస్ నాయకులు ఎంఆర్ వో జయశ్రీకి వినతిపత్రం అందచేశారు.

అనంతరం జెఏసీ కన్వీనర్ ఎ.శివారెడ్డి మాట్లాడుతూ ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వారిపై ఎస్.సి, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టమును ఉపయోగించి అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు.

రాజధానికోసం ఉద్యమం చేస్తున్న వారిపై తొలి నుండి ప్రభుత్వం కుట్రపూర్తంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే అనేక విధాలుగా రైతులను, మహిళలను వేధిస్తూ అన్యాయంగా కేసులు పెడుతున్నారన్నారు.

దేశ చరిత్రలో ఎక్కడా ఏప్రభుత్వం రైతులకు బేడీలు వేయలేదని రాష్ట్రంలోని దుర్మార్గపు ప్రభుత్వం మాత్రమే ఇలా చేసిందన్నారు.

రాజధాని అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ చర్యను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తప్పును తెలుసుకుని రాజధాని అమరావతి ఉంటుందని ప్రకటించాలన్నారు. 
 
ఎంఆర్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకటేశ్వరరావు మాటట్లాడుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అరెస్టు చేయడం సరైన చర్య కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలన్నారు.

మూడు రాజధానులకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ నాయకులనే మరో ఆందోళన చేయించి వారి మధ్య విభేదాలు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అది సరైన పద్దతి కాదన్నారు. ఈ వైఖరి విడనాడాలన్నారు.

జనసేననాయకులు పోతిన మహేష్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వారిపైనే ప్రయోగించిన తుగ్లక్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని విమర్శించారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా రైతులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో దళిన బహుజన ఫ్రంట్ నాయకులు భాగ్యారావు, అమరావతి పరిరక్షణ సమితి జెఎసి కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు, పలువురు జెఎసి ప్రతినిధులు పాల్గొన్నారు.