శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనలో అరెస్టులపర్వం : ఎల్జీ పాలిమర్స్ సీఈవోతో అరెస్టు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనలో అరెస్టుల పర్వం మొదలైంది. గ్యాస్ లీక్‌కు ప్రధాన కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు చెందిన సీఈవోతో సహా 12 మంది విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకర స్టైరీన్ విషవాయువు లీకై 15 మంది మృతి చెందగా, ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనమైంది. ఈ ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ నిందితులపై 304(2), 338, 285, 337, 284, 278 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ క్రమంలో తాజాగా పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్ కి జియాంగ్, సంస్థ డైరెక్టర్ డీఎస్ కిమ్, అదనపు డైరెక్టర్ మోహన్ రావు ఉన్నారు. కాగా, ఈ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తన పూర్తి నివేదికను మంగళవారం సీఎం జగన్‌కు సమర్పించింది. అటు నీరబ్ కుమార్ కమిటీ కూడా యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసిందని తేల్చింది. దీంతో అరెస్టులకు పోలీసులు శ్రీకారం చుట్టారు.