ఏపీ డీజీవీ గౌతం సవాంగ్ విశాఖ పర్యటన వెనుక నిజం ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బాస్ (డీజీపీ) గౌతం సవాంగ్ ఇటీవల విశాఖపట్టణంలో పర్యటించారు. ఈ పర్యటన వెనుక అసలు నిజం ఇపుడు వెల్లడైంది. నిజానికి రాజధాని తరలింపులో భాగంగానే విశాఖలో గ్రేహౌండ్స్ నిర్వహణ, శిక్షణ సంస్థ కోసం భూములు పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
వీటిపై గౌతం సవాంగ్ స్పందించారు. అది పూర్తిగా ఊహాజనితమని కొట్టిపడేశారు. హైదరాబాద్ గ్రేహౌండ్స్ తరహాలోనే రాష్ట్రంలోనూ ఆ విభాగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుతామన్న ఆయన విశాఖపట్టణం శివారులోని ఆనందపురంలో 384 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు.
అలాగే, సంస్థ నిర్వహణ, శిక్షణ కోసం కేంద్రం రూ.220 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అయితే, ప్రభుత్వం కేటాయించిన భూమి భవిష్యత్ అవసరాలకు సరిపోదని, కాబట్టి మరిన్ని భూములను పరిశీలించినట్టు చెప్పారు.
ఇకపోతే, బెంగళూరు, గోవా నుంచి విజయవాడ, విశాఖ, గుంటూరు ప్రాంతాలకు డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయన్న డీజీపీ.. ఏపీ, ఒడిశా సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న గంజాయి సాగుకు మావోయిస్టుల సహకారం ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 466 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని పేర్కొన్న ఆయన గత నెల రోజుల్లోనే 421 మందికి ఈ మహమ్మారి సంక్రమించిందని వివరించారు.
కాగా, ఏపీ ప్రభుత్వం రాజధానిని మూడుగా విభజించి, అందులో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖకు తరలించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులోభాగంగానే డీజీపీ గౌతం సవాంగ్ విశాఖలో పర్యటించినట్టు వార్తలు వస్తున్నాయి.