ఆంధ్రప్రదేశ్‌లో లాక్డౌన్? వెల్లడించిన ఏపీ సర్కారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరమైతే, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే లాక్డౌన్ విధిస్తామని ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు కరోనా కట్టడికి పాటించాల్సిన మార్గదర్శకాలను తాజాగా వెల్లడించింది. ఇందులో కేంద్ర ఆదేశానుసారం.. ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 31 వరకు అమలు చేయాలని 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కొవిడ్-19 తొలిదశను అద్భుతంగా నిరోధించగలిగామని, కొత్త స్ట్రెయిన్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని సూచించారు.
రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటే మాత్రం పరిస్థితిని బట్టి రాత్రిపూట కర్ఫ్యూ విధించవచ్చని సూచించారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం కేంద్రం అనుమతి లేకుండా లాక్డౌన్ అమలు చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. అంతర్రాష్ట నిబంధనలు కూడా అమలు చేయడానికి లేదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.
రెండు, మూడు షిప్టుల్లో సిబ్బంది కార్యాలయానికి వచ్చేలా అవకాశం కల్పించాలని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర మార్గదర్శకాలను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై అంటువ్యాధుల నివారణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి అన్ని జిల్లాల్లో కచ్చితంగా సర్వేలెన్స్, నివారణ, నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ప్రజలందరూ కచ్చితంగా మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. పబ్లిక్, పని ప్రదేశాల్లో మాస్కులు వాడకపోతే జరిమానా విధించాలని సూచించారు. మార్కెట్లు, వారాంతపు సంతలు, ప్రజా రవాణాలో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఒకే ప్రాంతంలో ఎక్కువగా కేసులు నమోదవుతుంటే వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కట్టడి ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ అత్యసవర సేవలకు మాత్రమే అనుమతివ్వాలన్నారు. సినిమాహాళ్లతోపాటు రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడలు వంటి అన్ని రకాల కార్యక్రమాలకు ఉపయోగించే హాల్స్‌లో 50 శాతం మందికి మాత్రమే అనుమతివ్వాలని సీఎస్ ఉత్తర్వుల్లో సూచించారు. కాగా, డిసెంబరు 31వ తేదీతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన విషయం తెల్సిందే.