బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (08:13 IST)

లోకేష్ సాయం చోరీకి గురైంది

ఓ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు చేసిన ఆర్థిక సాయం చోరీకి గురైంది. దీంతో ఆ బాధితులు లబోదిబోమంటున్నారు.
 
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన అంధ దంపతులు పాపిరెడ్డి, రేవతికి ముగ్గురు కుమారులు. ఎనిమిదేళ్ల వయసున్న వీరి పెద్ద కుమారుడు గోపాలకృష్ణారెడ్డి ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. తల్లిదండ్రులను ఆటోలో కూర్చోబెట్టుకుని గ్రామాల్లో వివిధ తిరుగుతూ రకాల పప్పులు అమ్ముకొంటూ జీవనం సాగిస్తున్నారు.

ఎనిమిదేళ్ల బాలుడు ఆటో నడిపే వీడియో ప్రసార మాధ్యమాల్లో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్‌ స్పందించి పాపిరెడ్డి కుటుంబానికి తొలిసారిగా రూ.20 వేలు, రెండో విడత రూ.80 వేలను టీడీపీ నాయకుల ద్వారా అందజేశారు. రెండో విడత ఇచ్చిన నగదును పాపిరెడ్డి తన ఇంట్లో ట్రంక్‌ పెట్టిలో పెట్టారు.

మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ట్రంక్‌ పెట్టిలో చూడగా, రూ.80 వేల నగదు మాయమైందని గుర్తించారు. ఇంటి పరిసరాల్లో తనిఖీ చేయగా ఓ సెల్‌ఫోను దొరికింది.

దీంతో పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసి, దొరికిన సెల్‌ఫోనును పోలీసులకు అప్పగించారు. క్లూస్‌టీమ్‌ వేలిముద్రలు సేకరించింది. కాగా, మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.