శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 18 ఆగస్టు 2018 (16:50 IST)

తిరుమలలో భారీ టిక్కెట్ల కుంభకోణం: వేల రూపాయలకు సుప్రభాతం టిక్కెట్లు...

కలియుగ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భారీ టిక్కెట్ల కుంభకోణం బయటపడింది. పారదర్సకత కోసం టిటిడి పలు చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు ఎన్నో రూపాల్లో అందులోని లొసుగులను తెలుసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. శ్రీవారిని ఏదో ఒక రూపంలో దర్శిం

కలియుగ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భారీ టిక్కెట్ల కుంభకోణం బయటపడింది. పారదర్సకత కోసం టిటిడి పలు చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు ఎన్నో రూపాల్లో అందులోని లొసుగులను తెలుసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. శ్రీవారిని ఏదో ఒక రూపంలో దర్శించుకోవాలన్న ఆత్రుతతో మోసగాళ్ళ వలలో భక్తులు చిక్కుకుంటున్నారు. తాజాగా నలుగురు భక్తులు సుప్రభాతం టిక్కెట్లు పొంది విజిలెన్స్‌కు దొరకడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
షోలాపూర్ లోని ప్రభాకర్ అనే వ్యక్తి ఇంటర్నెట్ కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఇతను పలు యూజర్ నేమ్‌లతో టిటిడి వెబ్ సైట్‌లో నమోదై ఉన్నాడు. వేర్వేరు యూజర్ నేమ్‌లతో వేర్వేరు ఆధార్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు నమోదు చేస్తున్నాడు. వేలాదిగా బుక్ చేయగా వందలాదిగా లాటరీలో టిక్కెట్లు లభిస్తున్నాయి. అయితే టిక్కెట్టు మీద ఉన్న పేరుకు అనుగుణంగా అప్పటికప్పుడు నకిలీ ఆధార్ కార్డులు తయారుచేసి భక్తులకు టిక్కెట్లు అంటగడుతున్నాడు. ఇందుకు అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నట్లు కూడా టిటిడి విజిలెన్స్ విచారణలో తేలింది. ఇలా బుక్ చేసుకున్న భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తారని అంచనా వేసిన విజిలెన్స్ అధికారులు వైకుంఠం-1లో నిఘా పెట్టి పట్టుకున్నారు.
 
షోలాపూర్‌కు చెందిన నాగేష్‌ జనార్థన్, వనిత, విజయ్ కుమార్, బసవరాజ్, రామచంద్రల టిక్కెట్లను పరిశీలించగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. యాత్రికులను విచారించగా ప్రభాకర్ అనే వ్యక్తి నుంచి 120 రూపాయల విలువ చేసే టిక్కెట్టును 2,500 రూపాయలకు కొనుగోలు చేసినట్లు వారు విచారణలో తెలిపారు. భక్తులతో పాటు ప్రభాకర్ కూడా రాగా అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమంపై తిరుమల ఒకటో పట్టణ పోలీస్టేషనులో టిటిడి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో తరచూ భక్తులు ఫిర్యాదు చేస్తున్నట్లుగా టిక్కెట్ల దుర్వినియోగం నిజమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఇటీవల నిర్వహించిన డయల్ యువర్ టిటిడి ఈఓ కార్యక్రమానికి భక్తుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆన్లైన్ లాటరీ విధానం కింద కొద్దిమందికి మాత్రమే ఎక్కువ టిక్కెట్లు లభ్యమవుతున్నాయని, నెలల కొద్దీ ప్రయత్నిస్తున్నా తమకు అవకాశం రావడం లేదని పలువురు ప్రస్తావించారు. దీంతో ఈఓ ప్రత్యేకంగా సివీఎస్ ఓ శివకుమార్ రెడ్డిని విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. దేవుడిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో భక్తులు దళారులను ఆశ్రయించవద్దని టిటిడి కోరుతోంది.