శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:01 IST)

మిఠాయి అడిగిందనీ కుమార్తెను కొట్టి చంపిన తండ్రి.. ఎక్కడ?

మహారాష్ట్రలోని గోండియా జిల్లా లోనారా గ్రామంలో దారుణం జరిగింది. మిఠాయి అడిగిందన్న కోపంతో ఓ తండ్రి కన్నబిడ్డను కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే, గోండియా జిల్లా లోనారా గ్రామానికి చెందిన వివేక్, వర్షా దంపతులకు 20 నెలల వైష్ణవి అనే కుమార్తె ఉంది. ఈ  చిన్నారి స్వీటు ఇప్పించమని మారాం చేసింది. దీంతో ఐదు రూపాయలు ఇవ్వాలని భర్తను భార్య కోరింది. 
 
స్వీటు కోసం కుమార్తె ఏడుస్తుండటంతో వివేక్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. పైగా, తన కుమార్తెను తీసుకొని ఆమెను తలుపు, ఇంటి మెట్ల మీద కొట్టాడు. అడ్డుకోబోయిన తనపై కూడా దాడి చేయగా, తాను పారిపోయానని భార్య వర్షా చెప్పారు. 
 
తీవ్రగాయాల పాలైన వైష్ణవిని టిరోడా ఉప జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు చెప్పారు. దీంతో భార్య వర్షా భర్త వివేక్ పై టిరోడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కసాయి భర్త వివేక్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.