గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (16:22 IST)

మామిడి ఎగుమతుల అభివృద్ధికి చర్యలు : కమిషనర్ ఎస్ఎస్. శ్రీధర్

మామిడి ఎగుమతుల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ ఎస్.ఎస్. శ్రీధర్ తెలిపారు. అపెడా సహకారంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మామిడి విక్రేతలు, కొనుగోలుదారుల సమావేశం నగరంలోని ఓ హెటల్లో మంగళవారం నిర్వహించారు. 
 
ఈ సమావేశంలో కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మొత్తం మామిడి దిగుబడులలో నాలుగు శాతం మనదేశంలో దిగుబడి అవుతోందని అన్నారు. మామిడి పంట ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో గణనీయమైన ఆదాయం లభిస్తోందని తెలిపారు. కోవిడ్ కారణంగా గతేడాది ఎగుమతులకు అవకాశం లేకపోవడంతో మామిడి మార్కెట్ కుదేలయిందని, కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఈ ఏడాది మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. 
 
పంట నాణ్యత పెరిగితే ఎగుమతి అవకాశాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, నూతన సాగు పద్ధతులను అవలంభించడం ద్వారా రైతులు నాణ్యమైన పంట దిగుబడులు సాధించాలని సూచించారు. నాణ్యమైన దిగుబడి అభివృద్ధికి, ఎగుమతులకు ప్రభుత్వం నుండి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. రాష్ట్రంలోని మామిడి పండిచే రైతులకు అధిక దిగుబడులు సాధించడంతో పాటు లాభదాయకమైన ధరలు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు.
 
డాక్టర్ వైఎస్సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ ఉద్యానవన శాఖ సమన్వయంతో రైతులకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని అన్నారు. కీటక నియంత్రణ కొరకు ప్రత్యేక వలలు, పండ్లు సక్రమంగా పక్వానికి వచ్చేలా రక్షణ కవర్లను ఆవిష్కరించినట్లు తెలిపారు. పంట నాణ్యత
 
పెంపొందించేందుకు విశ్వవిద్యాలయం ద్వారా అనేక పరిశోధనలు చేస్తున్నామని వెల్లడించారు. సాధరణంగా మామిడి కాపుకు వచ్చి కోత కోసి కొంతకాలం నిల్వ ఉంచేలా రైతుల్లో అవగాహన ఉండాలన్నారు. మామిడి పండించే రైతు సంఘాలకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.
 
 
అపెడా ఏజీఎం నాగ్ పాల్ మాట్లాడుతూ మామిడి సేకరణ నుండి ఎగుమతులు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేయాలనుకునే రైతులు అపెడా వెబ్ సైట్ నందు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మామిడి పండించే రైతులు, కొనుగోలుదారులు పరస్పరం చర్చించుకోవడం ద్వారా ప్రయోజనాలు ఉంటాయన్నారు. మామిడి రైతులు తమ పంటలకు నాణ్యమైన యాజమాన్య పద్ధతులు అవలంభించి విదేశాలకు ఎగుమతి అయ్యేలా కృషి చేయాలన్నారు.
 
 
ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టరు ఎమ్. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గుంటూరు కమీషనరేట్ జాయింట్ డైరెక్టర్ పావులూరి హనుమంతరావు, డిడిహెచ్ ధర్మజ, అపెడా మార్కెటింగ్ మేనేజర్ ధర్మారావు, నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం ప్రతినిధులు, ఉద్యానశాఖ అధికారులు, మామిడి రైతులు, విక్రేతలు, ఎగుమతి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రైతులు, ఎగుమతిదారుల మధ్య 500 మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోళ్లకు అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మామిడి పండ్ల ప్రదర్శనలో వివిధ రకాల మామిడి పండ్లను ఉంచారు.