మెగా కోడలు ఉపాసన పర్యవేక్షణతో... సాయి ధరమ్ తేజ్ సేఫ్
కొడుక్కి పెళ్ళైతే ఏ మావగారి ఇంటికైనా కోడలు వస్తుంది కానీ... మెగా స్టార్ చిరంజీవి ఇంటికి మాత్రం దేవత వచ్చింది... ఆ ఇంటికి ఓ పెద్ద ఆసుపత్రిలాంటి కేర్ వచ్చింది. కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఆ కోడలు స్పందించి, శుశ్రూషలు అందించే తీరు చూసి, మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఆమెనే మెగా కోడలు ఉపాసన.
ఉపాసన జస్ట్ ఆమె పేరు, ముందు వెనుక ఏమి ఉండదు. అలా అని ఆమె బ్యాక్ గ్రౌండ్ సామాన్యమైనది కాదు. అతి పెద్ద వైద్య సంస్థ అయిన అపోల్ లైఫ్‌కు ఆమె వారసురాలు. ఆ వైద్య సంస్థకు వైస్ చైర్ పర్సన్. ఉపాసనకు కావాల్సినంత సంపద. మహారాణి భోగం. కానీ వీటన్నిటికీ దూరంగా, చాలా సింపుల్ గా బతకడం అలవాటు చేసుకున్నారు. ఆమెకి సాటి మనిషికి గౌరవం ఇవ్వడం తెలుసు. నోరు లేని జీవులను ప్రేమించడం తెలుసు. దానం చేయడం తెలుసు. దాతృత్వం చాటుకోవడం తెలుసు. ఇన్ని మంచి సుగుణాలతో మెగా వారి ఇంట కోడలిగా అడుగు పెట్టిన ఉపాసన, ఇప్పుడు ఆ కుటుంబం పాలిట దేవత అయ్యింది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం సాయిధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. రేపో మాపో ఆయన డిశ్చార్జ్ కూడా అవ్వబోతున్నారు. తేజ్ పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుండి ఇంటికి వస్తున్నారనే వార్త విని ఆయన కుటుంబ సభ్యులు, మెగా ఫ్యామిలీ, తేజ్ అభిమానుల ఆనందానికి కారణం అయ్యింది. కానీ, ఈ విషయంలో ఒక వ్యక్తికి మాత్రం అంతా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నారు. ఆమె మరెవరో కాదు మెగా కోడలు ఉపాసన.
సాయిధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అవ్వగానే, ముందుగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స అందిన అనంతరం, ఉపాసన రంగంలోకి దిగారు. ఆఘమేఘాల మీద తేజ్ ని అపోలో ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. మేడమ్ చెప్పడంతో అర్ధ రాత్రి కూడా డాక్టర్స్ పరుగులు తీశారు. అక్కడ నుండి రెండు వారాలు పాటు, అపోలో బెస్ట్ డాక్టర్స్ తేజ్ ను మినిట్ టూ మినిట్ మోనిటరింగ్ చేస్తూ వచ్చారు. ఉపాసన కూడా తనకున్న పరిజ్ఞానంతో తేజ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వచ్చారు. కాలర్ బోన్ సర్జరీ లాంటి శస్త్రచికిత్సను అనుభవజ్ఞులైన వైద్యులచే చేయించారు. ఇప్పుడు తేజ్ ఇంత త్వరగా కోలుకుని ఇంటికి చేరుకుంటున్నాడంటే, దానికి ఉపాసన ప్రధాన కారణమని అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు భావిస్తున్నారు.
నిజానికి ఉపాసన ఇలా అన్నీ తానై తన వారిని కాపాడుకోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి, చిన్న మామయ్య పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డ సమయంలో కూడా ఉపాసన ఎంతో కేర్ తీసుకున్నట్లు సమాచారం. అపోల్ ఆస్పత్రి వైద్యులను వారి కోసం ప్రత్యేకంగా నియమించి, కరోనా నుంచి కోలుకునే వరకు కంటికి రెప్పలా చూసుకున్నారు. ఉపాసన లేకుంటే అంత పెద్ద హీరోలకి ట్రీట్మెంట్ అందడం కష్టం అయ్యేది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అంతటి కేరింగ్ సాధ్యమయ్యేదా అన్నదే ప్రశ్న. ఇందుకే ఉపాసన తమ ఇంటికి కోడలిగా రావడం తమ అదృష్టం అని చిరంజీవి చాలా సందర్భాల్లో చెప్పారు.
అలాగే మెగా బ్రదర్ నాగబాబు ఉపాసన గురించి మాట్లాడుతూ, కరోనా సమయంలో తను చేసిన సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారు. ఇలా ఆ ఉమ్మడి కుటుంబంలో అందరు మెచ్చిన కోడలు అయ్యారు ఉపాసన. నాలుగు రూపాయలు ఆస్తి ఎక్కువ ఉంటే చాలు, మెట్టినింటి బంధాలను మట్టిలో కలిపేస్తున్న కోడళ్ళు ఉన్న ఈ రోజుల్లో కూడా, ఉపాసన లాంటి మంచి మనసున్న కోడలు రావడం చిరు దంపతులు చేసుకున్న అదృష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.