అందరికీ జగన్‌ను గెలిపించాలనివుంది.. కానీ మన గుర్తు సైకిల్ అంటున్నారు : మంత్రి ధర్మాన ఆవేదన
వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని భావిస్తున్నారని, కానీ, మన గుర్తు ఏదని అడిగితే సైకిల్ అని చెబుతున్నారంటూ ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరికీ మళ్లీ వైకాపా అధికారంలోకి రావాలని ఉందన్నారు. కానీ, మన గుర్తు ఏదని అడిగితే సైకిల్ అని చెబుతున్నారని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదన్నారు. మీరు ఓటు వేసి గెలిపిస్తే వచ్చేసారీ అధికారంలోకి వస్తామని, వద్దనుకుంటే దిగిపోతామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛనుతో హాయిగా ఉన్నామని చాలా మంది చెబుతున్నారని, మళ్లీ జగన్‌ని గెలిపిస్తామనే అంటున్నారనీ, కానీ మన గుర్తు ఏదని అడిగితే మాత్రం సైకిల్ అంటున్నారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ జగన్ మళ్లీ అధికారంలోకి రావాలనీ, పథకాలన కొనసాగించాలని ఉందని కానీ గుర్తేంటో మాత్రం వారికి తెలియదని పేర్కొన్నారు. కాబట్టే ఈ అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. మన దగ్గర సరిపడ కరెంట్ లేదని అందుకే కోతలు విధిస్తున్నట్టు చెప్పారు.