సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా బిజీ.. అందుకే దావోస్ వెళ్లలేదు : మంత్రి గుడివాడ అమర్నాథ్
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షణం తీరిక లేకుండా చాలా బిజీగా ఉన్నారని అందుకే దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుకాలేక పోయారని ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ సదస్సుకు ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఈ వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదన్నారు. అదంతా దుష్ప్రచారమే అని చెప్పారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకావాలంటూ గత యేడాది నవంబరు 25వ తేదీన సీఎంకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానాలు అందాయని తెలిపారు.
అయితే, వచ్చే మార్చి నెలలో విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సును నిర్వహించనున్నామని, ఈ సందస్సుకు ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలని సీఎం జగన్ నిర్ణయించారని, ఆ పనుల్లో ఆయన తలమునకలై ఉన్నారని తెలిపారు.
గతంలో దావోస్ వెళ్లాలని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడైనా అక్కడి నిర్వాహకులను ఆహ్వానించారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో యేడాదికి రూ.11 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, జగన్ పాలనలో యేడాదికి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి గుడివాడ వివరించారు.