మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2022 (10:08 IST)

త్వరలోనే ఓ మంచి ముహూర్తాన విశాఖ నుంచి పాలన : మంత్రి అమర్నాథ్

ఓ మంచి ముహూర్తాన త్వరలోనే విశాఖపట్టణం నుంచి రాష్ట్ర పాలన ప్రారంభమవుతుందని ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదిస్తామని తెలిపారు. పైగా, రాష్ట్రంలో మూడు రాజధానులకు అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజల మద్దతు ఉందని ఆయన అన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెడతామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. మూడు రాజధానులకు అందరి మద్దతు ఉందని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానాలు చేశారని చెప్పారు. 
 
ఇకపోతే రాష్ట్రంలో ఏ సమస్య ఉందని టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పాదయాత్ర పేటెంట్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానిదేనని, యాత్రల ద్వారా వారు ప్రజల్లో భరోసా నింపారని మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు.