ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్- ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్నం భోజన పథకం
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇకపై జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధులకు గతంలోనూ ఈ పథకం అమలులో ఉండేది. 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేశారు. అయితే 2019లో అధికారం మారడంతో ఈ పథకం రద్దయింది.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. పదోతరగతి పూర్తిచేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాపౌట్స్ శాతం కొంత తగ్గించే అవకాశం ఉంది. విద్యార్ధులు ఉదయాన్నే కళాశాలకు వచ్చి మధ్యాహ్నం భోజన విరామం తర్వాత విద్యార్ధులు ఇళ్లకు వెళ్లిపోవడం, తరగతులను గైర్హాజరవడం తరచూ జరుగుతుంది.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులకి ఆర్థికంగా సహాయం మాత్రమే కాకుండా, విద్యలో ప్రగతికి కూడా దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ వరకు కరికులం ప్రక్షాళనపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.