గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:35 IST)

జగన్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు : వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపథకాలను చూసిన పేదలంతా.. దేశ ప్రధానిగా రాష్ట్ర మంత్రి కావాలని కోరుకుంటున్నారని వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి చెప్పుకొచ్చారు. 
 
ఏపీలో ఉత్తమ వలంటీర్లకు అవార్డులు అందించే కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పోరంకిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ వలంటీర్ వ్యవస్థ ఖ్యాతి జాతీయస్థాయికి చేరిందని, ప్రధాని మోడీ కూడా వలంటీర్ వ్యవస్థను అభినందించారని గుర్తుచేశారు.
 
ముఖ్యంగా, ఏపీ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను చూస్తే దేశంలోని పేదలంతా జగన్ ప్రధానిగా రావాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని బంగారు భవిత దిశగా సీఎం జగన్ నడిపిస్తున్నారని, ఇంటింటికీ సంక్షమ పథకాలు అందుతుండడం పట్ల దేశమంతా ఏపీ వైపు చూస్తోందని పార్థసారథి అన్నారు. 
 
జగన్ రాకతో జాతిపిత మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాకారమవుతోందన్నారు. దేశంలోని పేదలు జగన్‌ను ప్రధానిగా రావాలని కోరుకుంటారని పార్థసారథి వ్యాఖ్యానించిన సమయలో సీఎం జగన్ వేదికపైనే ఉన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు వలంటీర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం కాగా, సీఎం జగన్ చిరునవ్వుతో తన స్పందన తెలియజేశారు.