గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (15:15 IST)

తగ్గిపోతేనే ఫలితం ఉంటుంది.. చిరు చర్చలను స్వాగతించిన ఆర్కే రోజా

తెలుగు చిత్రపరిశ్రమలో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు వ్యవహారం ఇపుడు తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్య పరిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా, ఆయన గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై సినీ సమస్యలపై చర్చించారు. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కావడం మంచి శుభపరిణామం అన్నారు. 
 
చిరంజీవిలా ఎవరైనా సరే సీఎంను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపారు. అంతేకానీ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడితే ఎవరికీ మేలు జరగదన్నారు. సమస్య పరిష్కారం కోసం సావధానంగా నడుచుకోవాలన్నారు. సినీ రంగం చెబుతున్న అన్ని అంశాల్లో న్యాయం ఉందనిపిస్తే మాత్రం సీఎం జగన్ తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 
 
అయితే, రాష్ట్రంలోని విపక్షసభ్యులు ప్రతి అంశాన్ని రాద్దాంతం చేస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఏపీలో ఇపుడు రాజకీయం చేసేందుకు ఎలాంటి సమస్యా లేకపోవడంతో సినిమా టిక్కెట్ ధరలపై రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు.