శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 13 జనవరి 2022 (14:17 IST)

ఏపీలో కారుమబ్బులు: కుమ్మేస్తున్న వర్షాలు, మరో రెండు రోజులు...

ఏపీలో ఉదయాన్నే కారుమేఘాలు కమ్ముకున్నాయి. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

 
నైరుతి బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ, ఆగ్నేయ గాలులు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 
కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి, మాచవరం మండలాలతో పాటు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, మార్కాపురం, దోర్నాల మండలాల్లో బుధవారం వర్షం కురిసింది.

 
ఈ అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు, కొన్ని జిల్లాల్లో వరి కుప్పలు పొలాల్లోనే ఉండిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.