శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (23:03 IST)

చంద్రబాబుపై మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై సీనియర్ నటుడు మోహన్ బాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన మనసు గాయపరిచారంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలైపోయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారని, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారని, అంతా ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో మళ్ళీ ఇలా తన మనసును ఇబ్బంది పెడతావనుకోలేదని ట్వీట్ చేశారు. క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్‌బాబు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

తన మనసును చంద్రబాబు గాయపరిచారని, ఎన్టీఆర్, అక్కినేని లాంటి సినీ పెద్దలు, సినీ పరిశ్రమ తన క్రమశిక్షణ గురించి ఎన్నో సార్లు కొనియాడారని.. అది అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కరేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దయ చేసి ఏ సందర్భంలోనూ తన పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించొద్దని విజ్ఞప్తి చేశారు. అది ఇరువురికి మంచిదేనని.. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందామని అదీ ఇష్టమైతేనే అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.