శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (18:59 IST)

జాతీయ జెండా వైకాపా రంగులు వేస్తారా?: చంద్రబాబు

జాతీయ జెండాకు వైకాపా రంగులు వేయటంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇందుకు బాధ్యులైన జగన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.

జాతీయ జెండాకు వైకాపా రంగులు వేయటాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. జాతీయ జెండాకు ఇంతటి అవమానం ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు జగన్ ప్రభుత్వం బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త్రివర్ణ పతాకానికి వైకాపా రంగులు వేయటం అత్యంత హేయమైన చర్య అని ఆక్షేపించారు.

సీఎం జగన్ తన మంత్రులను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో పార్టీ తరఫున ప్రైవేటు కేసు వేసి మంత్రుల్ని బాధ్యుల్ని చేస్తామన్నారు. వైసీపీ నేతలు కేసులు పెట్టిన బాధితులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పార్టీ మారమంటూ తమను చిత్రహింసలకు గురిచేశారని ఆశావర్కర్ జయలక్ష్మీ.. చంద్రబాబు వద్ద కన్నీరుమున్నీరయ్యారు. మంత్రి పేర్నినాని వల్లే ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పుకొచ్చారు. దీంతో చలించిపోయిన చంద్రబాబు.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై పెత్తనం చేస్తామంటే సహించేది లేదన్నారు.

దళితులతో ఓట్లు వేయించుకున్న జగన్.. వారిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. బాధితులంతా ధైర్యంగా ఉండాలన్నారు. పేదలపై ఆంబోతుల్లా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేదల భూములను వైఎస్‌ కుటుంబం ఆక్రమించుకుందని ఆరోపించారు.

గన్నవరంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే కేసులు పెడతారా? అని ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. సోమిరెడ్డిపై అక్రమ కేసు పెట్టి పోలీస్‌స్టేషన్‌లో 5 గంటలు ఉంచారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు పెట్టి కోడెల ఆత్మహత్యకు కారణమయ్యారని దుయ్యబట్టారు.

చింతమనేనిపై వరుస కేసులు పెట్టి బయటికి రాకుండా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అన్యాయం చేసేవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని తీవ్రస్వరంతో హెచ్చరించారు. బాబాయ్‌ని ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని విమర్శించారు. వాళ్ల చిన్నమ్మకు జగన్ ఏం సమాధానం చెబుతారని అన్నారు.