శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (22:32 IST)

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి.. దీంతో భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాల వద్ద భారీగా వరుసలు కట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు  శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు.

దీంతో వేకువ జామున 3.30 గంటల నుంచి ప్రముఖుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. 3 వేల మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనానికి హాజరైనట్లు తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి  తెలిపారు. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు అనుమతి ఇచ్చారు.

నేటి నుంచి జనవరి 3 వరకు తిరుమలలో భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులకు టోకెన్లు జారీ చేశారు. 10 రోజుల పాటు స్వామివారి వైకుంఠ దర్శనం కల్పించడం ఇదే తొలిసారి. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో తిరుమలలోని 4 మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు. శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ వెంకట రమణ, రాష్ట్ర మంత్రులు నారాయణ స్వామి, సురేష్‌, ఏపీ సీఎస్‌గా ఎంపికైన ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ స్థానిక ఆలయాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి 
టీటీడీకి చెందిన స్థానిక ఆలయాల్లో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉదయం 4.30 గంటల నుంచి, అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 4- గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. రెండు ఆలయాల్లో రాత్రి 8 గంటల వరకు దర్శనం కొనసాగనుంది. 

తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి ఆలయం, శ్రీ గోవింద రాజస్వామి ఆలయం, ఉపమాక, ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం, నారాయణ వనం, కార్వేటినగరం,నాగలాపురం ఆలయాల్లో టీటీడీ కోవిడ్ 19 నిబంధనలు అమలు చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేసింది.