సోమవారం, 16 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (08:39 IST)

ముంబై నటి జెత్వానీ కేసు : డీజీపీ ఇచ్చిన నివేదికలోని కీలకాంశాలు ఇవే...

jaitwani kadambari
ముంబై నటి కాదంబరి జెత్వానీ అక్రమ అరెస్టు కేసులో ఏపీ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరణాత్మక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో ముంబై నటి అక్రమ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో కుట్ర పన్నగా, ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నిలు కీలక పాత్ర పోషించినట్టు తేల్చారు. దీంతో ఈ ముగ్గురిపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు, ప్రభుత్వానికి డీజీపీ సమర్పించిన నివేదికలోని అంశాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నిలను 2024 జనవరి 31న నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)కు పిలిచి మాట్లాడారు. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి నరేంద్రకుమార్ జెత్వానీని అరెస్టు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీచేశారు. అప్పటికి ఆమెపై ఎలాంటి కేసూ లేదు. ఫిబ్రవరి 2న ఉదయం 6.30కు ఆమెపై కేసు నమోదైనట్లు రికార్డులు సూచిస్తున్నాయి. అంటే కేసు నమోదుకు ముందే, ఆమె అరెస్టుకు పీఎస్ఆర్ ఆదేశాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆయన తన హోదా, అధికారాన్ని ఉపయోగించి, అసంపూర్తి సమాచారం ఆధారంగా కేసు నడిపించడం, పరిశీలన లేకుండానే దర్యాప్తును వేగవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇది కుమ్మక్కు, అధికార దుర్వినియోగమే. విధి నిర్వహణలో తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు.
 
సీఐడీ విభాగం డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆంజనేయులు చెప్పిన నోటిమాటతో నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. కాదంబరి అరెస్టుకు ఆదేశించడంతో పాటు ఎఫ్ఎస్ఐఆర్ నమోదుకు ఒకరోజు ముందే విమాన టికెట్లు బుక్ చేయించడంలో కాంతిరాణా పాత్ర ఉంది. కేసు విచారణను పర్యవేక్షించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించకుండా, ప్రాథమిక విచారణ చేయకుండానే జెత్వానీని అరెస్టు చేయాలని జనవరి 31న అధికారులకు ఆదేశాలిచ్చారు. 
 
సంబంధిత అధికారులు ముంబై వెళ్లేందుకు విమాన టికెట్లు ఏర్పాటు చేయాలని తన సీసీకి సూచించారు. పోలీసు బృందాన్ని ఏర్పాటుచేసి, నిందితుల అరెస్టుకు ఇతర రాష్ట్రానికి పంపేముందు రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదు. ఫారిన్ పాస్ పోర్ట్ (విమానంలో వెళ్లేందుకు అనుమతి) లేదు. రాష్ట్రం దాటి వెళ్ళే పోలీసులకు పోలీస్ శాఖ జారీ చేసే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నమాట. 
 
కాంతిరాణా మౌఖిక ఆదేశాలతో ఆయన సీసీ.. నాటి డీసీపీ విశాల్ గున్ని, ఏడీసీపీ రమణమూర్తి, ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్‌కు ఫిబ్రవరి 1న ప్రయాణానికి విమాన టికెట్లు బుక్ చేశారు. అప్పటికీ జెత్వానీకి వ్యతిరేకంగా ఎఫ్ఎస్ఐఆర్ నమోదు కాలేదు. కమిషనర్ సూచనల మేరకు సీసీ తర్వాత ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఆర్ఎస్ఐ ఎ.దుర్గాదేవి, కానిస్టేబుళ్లు మౌనిక, రమేశ్, గీతాంజలి, రమ్యలకు కూడా విమాన టికెట్లు తీసుకున్నారు.
 
ఇంటెలిజెన్స్ డీజీ చెప్పారన్న ఏకైక కారణంతో కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా హడావుడిగా ముంబై వెళ్లి జెత్వానీని అరెస్టు చేసి, నాటి డీసీపీ విశాల్ గున్ని విధి నిర్వహణలో ఘోరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు. కేసును సరిగా విచారించడంలోనూ విఫలమయ్యారు. ఫిబ్రవరి 2న ఉదయం 6.30కు ఎఫ్ఎస్ఐఆర్ రిజిస్టర్ అయింది. ముందే నిర్ణయించుకున్నట్లు ఉదయం 7.30కు ఉన్నతాధికారుల నుంచి రాతపూర్వక ఆదేశాలు, ప్రయాణానికి విదేశీ పాస్ పోర్టు లేకుండానే ఆయన ముంబై బయల్దేరారు. 
 
డీజీ, సీపీ ఆదేశాలతో ఆయన ఈ చర్యలకు ఉపక్రమించినట్లు స్పష్టమవుతోంది. అధికారిక పనిపై ముంబై వెళ్లిన గున్ని.. ఎలాంటి టీఏ (రవాణా భత్యం) క్లెయిమ్ చేయలేదు. అరెస్టు అయిన వ్యక్తులకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. నటి అరెస్టుకు ముందు ఎలాంటి విచారణ చేయలేదు. సరైన సాక్ష్యాలు, డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండానే, ఎఫ్ఎస్ఐఆర్ నమోదైన కొద్ది గంటల్లోనే వ్యవహారమంతా నడిపించారు. ఇది దర్యాప్తులో ప్రాథమిక సూత్రాలను విస్మరించడం తప్ప, మరోటి కాదు అని అన్నారు.