నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక హంగులు.. తగ్గిన ప్రయాణ సమయం
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి దివ్యదర్శనం కోసం ప్రారంభించిన నారాయణాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కొత్త హంగులు దిద్దుకుంది. నిత్యం వేలాది మంది భక్తులను ఏడుకొండల స్వామిచెంతకు సురక్షితంగా చేరుస్తున్న రైలును ఆధునీకరించి సరికొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణతోపాటు రైలు వేగాన్ని పెంచడంతో ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఏర్పడింది.
ఈ రైలును గత 1991 జనవరి 7న సికింద్రాబాద్-తిరుపతి స్టేషన్ల నడుమ ప్రారంభించారు. పెరిగిన ప్రయాణికులు, డిమాండ్‌కు అనుగుణంగా రైలును 2018 సెప్టెంబర్ 5న లింగంపల్లి వరకు పొడిగించారు. లింగంపల్లి-తిరుపతి స్టేషన్ల నడుమ తిరిగే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ గతంలో సాధారణ బోగీలతోనే నడిచింది. రైలులో ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు మెరుగైన భద్రత కల్పించేందుకు లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లతో రైలును కొత్తగా తీర్చిదిద్దారు.
ప్రయాణికులు ఎలాంటి కుదుపులు లేకుండా ప్రయాణించేందుకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉపయోగపడతాయి. కోచ్‌ల్లో సౌకర్యవంతమైన సీట్లు, రైలు నడుస్తున్న సమయంలో బయటి దృశ్యాలను చూసేందుకు పెద్ద పెద్ద కిటికీలు, లగేజీ బ్యాగులను పెట్టుకునేందుకు సెల్ప్‌లు, అరలు, పీవీసీ ఫ్లోరింగ్‌ను ఏర్పాటు చేశారు. వీటితోపాటు పర్యావరణ హితంగా నిర్మించిన బయో టాయిలెట్లు, ఏసీ బోగీల్లో వెలుగులు విరజిమ్మే లైట్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ పూర్తిగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌తో నడుస్తుండడం మరో అదనపు ప్రత్యకతగా చెప్పవచ్చు. ఇప్పటివరకు విద్యుద్దీకరణ ఏర్పాటు లేని పగిడిపల్లి-గుంటూరు సెక్షన్లలో రైలు డీజిల్ ఇంజిన్‌తో గుంటూరు వరకు నడిచిన తర్వాత విద్యుత్ ఇంజిన్‌ను జతచేసేవారు. ప్రస్తుతం పగిడిపల్లి-గుంటూరు సెక్షన్ కూడా విద్యుద్దీకరించడంతో ఈ రైలు ప్రయాణమంతా ఎలక్ట్రిక్ ఇంజిన్‌తోనే సాగుతోంది. దీంతో గుంటూరు ఇంజిన్ మార్పిడికి పట్టే సమయం ఆదా కావడంతోపాటు రైలు వేగం కూడా పెంచడంతో ప్రయాణ సమయంలో 20 నిమిషాలు తగ్గింది.
పైగా, నారాయణాద్రి సూపర్‌ఫాస్ట్ రైలుకు ఎలక్ట్రిక్ ఇంజిన్‌తోపాటు లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు తగినంత వెలుతురు అందుతుంది. అలాగే శబ్దకాలుష్యం, కర్బన్ ఉద్గారాల విడుదల కూడా తగ్గిపోయి రైల్వేకి ఇంధన ఆదాతో ఏటా సుమారు 6 కోట్ల ఆదాయం మిగులుతోంది. కాగా, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును గతంలో కంటే కొత్తగా ఆధునీకరించడంతో ఇటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యంతోపాటు దక్షిణ మధ్య రైల్వేకి కూడా ఇంధన ఖర్చుపై మిగులుబాటు కానుంది.