సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 15 డిశెంబరు 2021 (13:32 IST)

ఏపీ సీఎం, గ‌వ‌ర్న‌ర్ల‌ను క‌లిసిన నేవీ వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ ను ఆయ‌న క్యాంప్‌ కార్యాలయంలో తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవలే  తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్‌గా భాద్యతలు స్వీకరించిన వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా, స‌ముద్ర తీరంలో ఎదుర‌య్యే భ‌ద్ర‌త స‌వాళ్ళ‌పై నేవీ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సీఎం కు వివ‌రించారు. ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తాని సన్మానించి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమను సీఎం జ‌గ‌న్ అందజేశారు. 
 
 
ఈ సందర్భంగా సీఎంని నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్‌ వీఎస్‌సీ రావు, కెప్టెన్‌ ప్రదీప్‌ సింగ్‌ సేతి, సివిల్‌ మిలటరీ లైజన్‌ ఆఫీసర్‌ కమాండర్‌ సుజిత్‌ రెడ్డి క‌లిశారు. మ‌రోప‌క్క వీరంతా ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ ను కూడా మర్యాదపూర్వకంగా కలిసారు. మంగళవారం ఉదయం నావికదళ అధికారులతో కలిసి రాజ్ భవన్ కు వచ్చిన దాస్ గుప్తాకు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ స్వాగతం పలికారు. 
 
 
బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా గవర్నర్ ను కలిసిన వైస్ అడ్మిరల్ సముద్ర తీరం వెంబడి దేశ భద్రతకు సంబంధించి ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించేందుకు తూర్పు నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను గురించి దాస్ గుప్తా గవర్నర్ కు వివరించారు. దేశ భద్రత విషయంలో రాజీలేని ధోరణిని అనుసరించాలని ఈ సందర్భంగా గవర్నర్ నావికాదశ అధికారులకు సూచించారు. మరోవైపు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విశాఖపట్టణంలో జరగనున్న ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ రివ్యూ, మల్టినేషనల్‌ మేరిటైమ్‌ ఎక్సర్‌సైజ్‌ మిలాన్‌ సన్నాహక కార్యకలాపాల పురోగతిని కూడా నావికాదళ అధికారులు గౌరవ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు వివరించారు.