శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (07:36 IST)

ఏపీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. నీలం సాహ్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోగన్ రెడ్డి ముఖ్య సలహాదారుగా ఉన్నారు. 
 
కాగా, ప్రస్తుత ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. దీంతో ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా చేసి ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
నిజానికి కొత్త ఎస్ఈసీ కోసం ఏపీ సర్కారు ముగ్గురి పేర్లను ప్రతిపాదించగా, వారిలో నీలం సాహ్నీ ఒకరు. తాజాగా ఆమె పేరును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేయడంతో ఏపీ కొత్త ఎస్ఈసీ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.
 
నీలం సాహ్నీ ఏప్రిల్ 1న ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. నీలం సాహ్నీ గత డిసెంబరులో ఏపీ సీఎస్‌గా పదవీ విరమణ చేశారు. ఆపై ఆమె సీఎం జగన్ ప్రధాన సలహాదారుగా నియమితులవడం తెలిసిందే.