1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (11:09 IST)

తెలుగువ్యక్తి సుప్రీం జడ్జి కాకుండా అడ్డుకునేందుకు జగన్ కుట్ర : వైకాప ఎంపీ

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఓ తెలుగు వ్యక్తి కాబోతుండటాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారనీ, అందుకే ఆ నియామకాన్ని అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్నారంటూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణపై నియామకాన్ని అడ్డుకోడానికి ఇంత పన్నాగమా? ఆయనపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు చేస్తారా’ అంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జస్టిస్‌ రమణపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేకు ముఖ్యమంత్రి రాసిన లేఖతో ఏపీ ప్రభుత్వం పరువు పోయిందన్నారు. దీనివల్ల రాజ్యాంగం, న్యాయవ్యవస్థలను గౌరవించేవారి ముందు చులకనయ్యామని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
పార్లమెంటులో అనేక మంది ఎంపీలు తనను కలిసి సీఎం లేఖ తీరును అభిశంసించారని తెలిపారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల కేసును హైకోర్టు కొట్టేసినా బుద్ధిరాలేదని.. జస్టిస్‌ రమణపై అవే ఆరోపణలతో సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తారా అని మండిపడ్డారు.
 
సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ఒక తెలుగువాడు నియమితులైతే అందరం గర్వించాలన్నారు. ‘సీఎం సలహాదారు అజయ్‌రెడ్డి కల్లం.. జగన్‌ రాసిన లేఖను మీడియా ముందు బహిర్గతం చేశారు. ఇప్పుడేమైంది..? సీఎం లేఖలో పేర్కొన్న ఆరోపణలన్నీ ఆధారరహితంగా, చిల్లరగా, అసత్యాలు.. దురుద్దేశాలతో కూడుకుని ఉన్నాయని జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యానించినట్లు ఒక ఆంగ్ల పత్రికలో వార్త వెలువడిందన్నారు.
 
ఇది సీఎంకు చెంపపెట్టు అని రఘురామకృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు చెబితే.. ఆయన్ను రాజీనామా చేయాలని తమ పార్టీకి చెందిన కొందరు నేతలు, మంత్రులు  డిమాండ్‌ చేశారని.. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తే జగన్‌ ఆరోపణలు అబద్ధాలని తీర్పు చెప్పినందున.. సీఎంను కూడా రాజీనామా చేయమంటారేమోనని అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.