శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (12:05 IST)

విజిల్ (ఈల) లేదని కానిస్టేబుళ్లకు మెమో జారీ చేసిన ఎస్పీ

appolice
విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్ల వద్ద విజిల్ (ఈల) లేదని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు వారికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. నేర నియంత్రణలో ఈల చక్కగా ఉపయోగడుతుందని, అలాంటి విజిల్ లేకుండా విధులు ఎలా నిర్వహిస్తారంటూ వారిని ప్రశ్నించారు. 
 
నెల్లూరు సంతపేట పోలీసు స్టేషన్‌ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి.. సిబ్బంది వివరాలు? ఎవరెవరు విధుల్లో ఉన్నారు? బీట్‌కు ఎంత మందిని కేటాయిస్తున్నారు? అనే వివరాలు తెలుసుకున్నారు. 
 
ఆ క్రమంలోనే యూనిఫాంతో పాటు విజిల్‌ పెట్టుకోని వారెందరున్నారని ప్రశ్నించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకురాలేదని గుర్తించి.. దాని ప్రాధాన్యం, ఉపయోగాలను వివరించారు. వారిద్దరికీ మెమో జారీ చేయాలన్నారు. సెట్‌ కాన్ఫరెన్స్‌ బుక్‌ ఎందుకు నిర్వహించడం లేదని ఇన్‌స్పెక్టర్‌ అన్వర్‌బాషాను ప్రశ్నించారు. 
 
అలాగే, ఠాణాలో పెండింగ్‌లో ఉన్న కేసులపైనా ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా ఒక్క మర్డర్‌ కేసు కూడా పెండింగ్‌లో లేదని.. సంతపేట పీఎస్‌లో మాత్రం ఒక్క హత్య కేసు ఉందన్నారు. వీలైనంత వరకు సత్వరం పరిష్కరించాలన్నారు. రికవరీ సాధనకు కానిస్టేబుళ్లకు లక్ష్యాలు నిర్దేశించాలని, దోపిడీ కేసులను ఎస్సైలకు కేటాయించాలని సూచించారు. 
 
అలాగే, ఎస్పీ వస్తున్నారని, రోడ్లపై ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడం కాదని సాధారణ రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉండాలని హితవు పలికారు. స్టేషన్‌లో ఉన్న వాహనాలను పరిశీలించి వేలం వేయాల్సిందిగా సూచించారు. ఎస్పీ వెంట ఎస్‌బీ డీఎస్పీ కోటారెడ్డి, నగర ఇన్‌ఛార్జి డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.నాగేశ్వరమ్మ ఉన్నారు.