మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (15:56 IST)

చంద్రబాబు అడ్డాపై ఫోకస్ పెట్టిన వైకాపా అధినేత!

ys jagan
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడ్డా కుప్పంపై వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాగైనా వైకాపా జెండా ఎగురవేయాలన్న గట్టిపట్టుదలతో జగన్ ఉన్నారు. అందుకే ఈ స్థానంపై ఇప్పటి నుంచే దృష్టిసారించారు. 
 
ఇందులోభాగంగానే, ఈ నెల 22వ తేదీన కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఆ రోజున కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలను జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం ప్రయాణించే హెలికాఫ్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు. 
 
కాగా, కుప్పం మున్సిపాలిటీతో పాటు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా అత్యధిక సీట్లు సాధించిన విషయం తెల్సిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానంలో జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఆ పార్టీ ఉంది. అందుకే రాష్ట్ర సీనియర్ మంత్రి పెద్దిరామచంద్రారెడ్డికి కుప్పం బాధ్యతలను సీఎం జగన్ అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు, జగన్ కుప్పం పర్యటనకు రానున్న నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆ సందర్భంగా వైకాపా నేతలు, కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు కట్టిన స్వాగత కటౌట్లు, ఫ్లెక్సీలతో పాటు బ్యానర్లను కూడా చింపివేసి, కాల్చి వేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. మరి సీఎం జగన్ పర్యటనలో టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తిస్తారో వేచి చూడాల్సిందే.