ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (11:55 IST)

ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న ఏపీ సీఎం జగన్.. ఎందుకో తెలుసా?

ys jagan
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. దీంతో ఆయన హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. జగన్‌పై అనేక అవినీతి అక్రమ కేసులు ఉన్నాయి. వీటిని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుల విచారణ హైదరాబాద్ నగరంలోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో సాగుతున్నాయి. 
 
ఈ క్రమంలో తొలుత సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ తర్వాత ఈడీ నమోదు చేసిన కేసులపై విచారణ చేపట్టాలంటూ జగన్ అండ్ కో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐ కేసుల విచారణ తర్వాత ఈడీ కేసుల విచారణకు సమ్మతించింది. దీనికి కారణం లేకపోలేదు. సీబీఐ కేసుల్లో నిర్దోషిగా తేలితే ఈడీ నమోదు చేసిన అన్ని కేసులను విచారణ లేకుండానే కొట్టివేశారు. ఈ ప్లాన్‌తో జగన్ అండ్ కోసం తొలుత సీబీఐ కేసుల విచారణకు పట్టుబట్టి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. 
 
నిజానికి తొలుత సీబీఐ కేసులనే విచారించాలంటూ జగన్ అండ్ కో నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు అందుకు అంగీకరించలేదు. తొలుత ఈడీ కేసులనే విచారించి, ఆ తర్వాత సీబీఐ కేసుల విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. ఈ తీర్పును వైకాపా రాజ్యసభ సభ్యుడు, జగన్ కుడిభుజంగా ఉండే విజయసాయిరెడ్డి తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. 
 
ఈ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. గురువారం కీలక తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అంతేకాకుండా, ఈడీ కేసుల కంటే ముందుగా సీబీఐ కేసులపైనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ రెండు దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులపై ఒకేసారి విచారణ జరిగితే తొలుత సీబీఐ కేసుల్లో తీర్పు వెలువరించిన తర్వాత ఈడీ కేసుల్లో తీర్పును వెలువరించాలని సూచించింది. సీబీఐ కోసులు కొట్టివేతకు గురైతే ఈడీ కేసులో ఉండబోవని కూడా హైకోర్టు స్పష్టం చేయడం గమనార్హం.