గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (17:23 IST)

కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది : హైకోర్టు

పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లాలను పెంచే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన అధికార పరిధిలోనే వ్యవహరించిందని పేర్కొంటూ ఇందుకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. 
 
వరంగల్ జిల్లాకు చెందిన రంగు బాలలక్ష్మితో పాటు మరో నలుగురు కలిసి ఈ పిల్‌ను కోర్టులో దాఖలు చేశారు. ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయ విధానంలో, ఏకపక్షంగా విభజించిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అనుసరించిన విధానం తెలంగాణ డిస్ట్రిక్ట్స్ యాక్ట్ 1974, తెలంగాణ డిస్ట్రిక్ట్ రూల్స్ 2016 నిబంధనలకు విరుద్ధంగా ఉందని వాదించారు. ఈ వాదనలు ఆలకించిన ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారం ఉందని స్పష్టం చేసింది. 
 
కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు వెనుక చెడు ఉద్దేశ్యాలు ఉన్నట్టు పిటిషన్లు నిరూపించలేకపోయారని, అలాంటపుడు న్యాయ సమీక్షకు ఆదేశించలేమని ధర్మాసనం అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది.