గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

మంత్రి కేటీఆర్ అండతోనే డ్రగ్ మాఫియా చెలరేగుతోంది : మహేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ మాఫియా చెలరేగిపోవడానికి ప్రధాన కారణం ఆ రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 
 
ఆదివారం వేకువజామున హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ మింక్ పబ్‌లో జూబ్లీ హిల్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేసమయంలో ఈ దాడులు జరిపిన పోలీసులపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. 
 
ఈ అంశంపై మహేశ్ కుమార్ మాట్లాడుతూ, కేటీఆర్ అండదండలతోనే హైదరాబాద్ నగరంలో డ్రగ్ మాఫియా చెలరేగిపోతుందని ఆరోపించారు. ఎవరి అండ లేకపోతే పబ్‌లను అర్థరాత్రి దాటిన తర్వాత 3 గంటల వరకు ఎలా తెరిచి వుంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. 
 
ఫుడింగ్ మింక్ పబ్‌పై దాడులు జరిపిన పోలీసుల్లో ఏసీపీకి చార్జ్ మెమో ఇవ్వడం, సీఐను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. వారిని అభినందించాల్సిన ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వారిపైనే చర్యలు తీసుకోవడం న్యాయం కాదన్నారు. డ్రగ్స్‌ను అరికట్టే విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా ఎన్సీబీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.