బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (17:49 IST)

గ్రేట్.. మీ ధైర్యానికి సెల్యూట్ : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి కేటీఆర్

ktramarao
ఇటీవల తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి ధైర్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన తర్వాత వారితో ప్రసంగించారు. తాను కూడా హాస్టల్స్‌లో చదివానని, హాస్టల్స్‌లో ఉండే సమస్యలు తనకు కూడా బాగా తెలుసని ఈ సందర్భంగా అన్నారు. 
 
ముఖ్యంగా తమ సమస్య పరిష్కారం కోసం బాసర విద్యార్థులు అనుసరించిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. రాజకీయాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా తమ సమస్యలపై తామే పోరాడిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు చెప్పారు. 
 
పనిలేని విపక్ష రాజకీయ నేతలను పిలవకుండా స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్‌గా ఏర్పడి మీ సమస్యలపై మీరే పోరాడడం బాగుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఎంచుకున్న విధానం కూడా తనకు బాగా నచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 
 
ముఖ్యంగా గాంధీ తరహాలో శాంతియుతంగా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా బయటకూర్చొని నిరసన తెలియజేయడం చాలా మందికి నచ్చిందన్నారు. అందులో తాను కూడా ఒకడినని చెప్పారు. 
 
తాను ఈ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఈ మాట చెబుతున్నానని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే ఈ సమ్మె చేస్తున్నామని విద్యార్థులు ప్రభుత్వానికి స్పష్టం చేశారని తెలిపారు.