శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (18:16 IST)

'అడవి దొంగ' సినిమా చూపిస్తూ బామ్మకు సర్జరీ..

Adavi Donga
Adavi Donga
మెగాస్టార్ సినిమా 'అడవి దొంగ' చూపిస్తూ బామ్మకు సర్జరీ చేశారు వైద్యులు. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ 50 ఏళ్ల మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. 
 
వైద్యులు ఆమెకు పరీక్షలు చేశారు. తర్వాత ఆమె మెదడులో ఓ కణితిని గుర్తించారు. ఆ కణితిని తొలిగించడానికి ఆగస్టు 25న ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే ఆపరేషన్ చేస్తున్నంత సేపు కూడా, ఆమెను స్పృహలోనే ఉంచారు. అలా స్పృహలో ఉంచుతూనే, అత్యంత క్లిష్టమైన వైద్య ప్రక్రియను పూర్తిచేశారు.  
 
అయితే చిత్రమేంటంటే, ఆపరేషన్ జరిగేటప్పుడు పేషెంట్ ఆలోచనలను మరల్చేందుకు చిరంజీవి నటించిన ‘అడవి దొంగ’ సినిమా చూపించారు. అంతే ఆ బామ్మ ఆ సినిమాలో పూర్తిగా లీనమైపోయింది. తర్వాత, ఆపరేషన్ చేస్తున్న వైద్యులు మధ్యమధ్యలో ఆమెతో మాటలు కలుపుతూ.. విజయవంతంగా శస్త్ర చికిత్సను పూర్తి చేశారు.
 
ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యాక, ఈ ప్రక్రియ గురించి డాక్టర్లు మీడియాతో మాట్లాడారు. ఇలా స్పృహలో ఉండగానే రోగి మెదడుకు సర్జరీ చేసే పద్ధతిని ‘అవేక్ క్రేనియాటోమీ’ అంటారని తెలిపారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతం అవ్వడంపై, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు హర్షం వ్యక్తం చేశారు. 
 
తాను చిరంజీవి అభిమానినని.. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ చూస్తూనే ఉన్నానని ఆ బామ్మ తెలిపింది. ఇంకా మహిళను రెండు రోజుల్లో నేరుగా గాంధీ ఆస్పత్రికే వచ్చి పరామర్శిస్తానని మెగాస్టార్ చెప్పారు. అదేవిధంగా సర్జరీ చేసిన వైద్యులను కూడా చిరంజీవి అభినందించారు.