'మూడు రాజధానులు' విషయంలో బీజేపీ ఏపీ శాఖ దాగుడు మూతలు

somu veerraju
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 31 జులై 2020 (13:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ దాగుడుమూతలకు తెరతీసింది. నిన్నటి వరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. కానీ, ఇపుడు కొత్తగా అధ్యక్షుడుగా నియమితులైన సోము వీర్రాజు మాత్రం మరోమాట మాట్లాడారు. మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. అంటే.. అమరావతి విషయంలో బీజేపీ ద్వంద్వ నాటకానికి తెరతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతూ, ఏపీ‌ రాజధాని తరలింపులో కేంద్ర ప్రభుత్వానికి పాత్ర ఉందన్నారు. అందుకే రాజధాని రైతులకు పన్ను మినహాయింపు ఇచ్చారని గుర్తుచేశారు. రాజధాని విషయంలో ప్రజలకు ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర సర్కారుదే తుది నిర్ణయమని, ఇప్పటికే అమరావతిని రాజధానిగా సర్వే ఆఫ్‌ ఇండియా కూడా గుర్తించిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. రాజధానిపై గత 70 ఏళ్లలో ఎన్నడూ జరగని గందరగోళం జరుగుతోందని తెలిపారు.

అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలను తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన ఏపీ బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. 'రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందన్న బీజేపీ ఎంపీ సుజనాచౌదరి గారి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బీజేపీ విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు గారు స్పష్టం చేశారు' అని పేర్కొంది.

అంతకుముందు.. బీజేపీ ఏపీ శాఖ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసమస్యల విషయంలోనే కలుగజేసుకుంటుందన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో కొత్త రాజధానులు ఏర్పాటు చేస్తున్నా.. కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు.

'గతంలో నాటి సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తేనే అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ వచ్చారు. అమరావతిపై చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కేంద్రం ఏనాడూ జోక్యం చేసుకోదు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం కొత్తగా మూడు రాజధానుల విధానం చేపడితే కేంద్రం జోక్యం చేసుకోవాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అది ఎప్పుడూ జోక్యం చేసుకోదు. అయితే రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు మాత్రం అన్యాయం జరగకుండా పోరాడతాం. ఈ విషయంలో టీడీపీ నేతలు బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు' అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈయన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్రంలో కలకలం రేపాయి.

దీనిపై మరింత చదవండి :