గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (08:31 IST)

ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరి సందేహమేనా?

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులోని దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరిశిక్షలను అమలు మరోమారు అనుమానంగా మారింది. నిజానికి ప్రత్యేక కోర్టు జడ్జి ఇచ్చిన డెత్‌ వారెంట్‌ ప్రకారం ఆ నలుగురినీ ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరి తీయాల్సి ఉన్నా, అమలు జరిగే సూచనలు కనిపించడం లేదు. 
 
క్షమాభిక్షను తిరస్కరిస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దోషుల్లో ఒకరైన ముఖేశ్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. జైల్లో బాధలు పడ్డానన్న కారణంపై రాష్ట్రపతి తిరస్కార నిర్ణయంపై న్యాయసమీక్ష కోరడం కుదరదని బెంచ్‌ స్పష్టం చేసింది. దీంతో ముఖేశ్‌కు న్యాయమార్గాలన్నీ మూసుకుపోయినట్లే! 
 
అయితే, మిగిలిన ముగ్గురు దోషులకూ కొన్ని అవకాశాలున్నాయి. అక్షయ్‌ కుమార్‌సింగ్‌ బుధవారం క్యూరేటివ్‌ పిటిషన్‌ వేశాడు. దీనిపై గురువారం ఇదే బెంచ్‌ విచారణ జరుపుతుంది. బెంచ్‌ దీన్ని తిరస్కరిస్తే రాష్ట్రపతి క్షమాభిక్ష కోరవచ్చు. అదీ తిరస్కారమైతే దాని మీద న్యాయసమీక్ష కోరవచ్చు. వినయ్‌ కుమార్‌ శర్మ క్యూరేటివ్‌ను సుప్రీంకోర్టు గతంలోనే తిరస్కరించింది. 
 
బుధవారం రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నాడు. ఆయన తిరస్కరిస్తే సుప్రీంలో వినయ్‌ న్యాయసమీక్ష కోరవచ్చు. పవన్‌ గుప్తా ఇంకా క్యూరేటివ్‌కు దరఖాస్తు చేయలేదు. దాన్ని కోర్టు కొట్టేస్తే రాష్ట్రపతి తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయి. దీన్ని పరిశీలించిన రాష్ట్రపతి నో చెబితే మళ్లీ సుప్రీంకెక్కి రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్‌ చేయవచ్చు. అందువల్ల వచ్చే నెల ఒకటో తేదీన నిర్భయ దోషులను ఉరితీయడం సందేహమేనని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు.