బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (18:59 IST)

విజయవాడ, తిరుపతిలో నాన్ వెజ్ షాప్స్‌కు బంద్- మటన్‌లో దాన్ని కలిపేస్తున్నారు..

విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో విజయవాడలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు . నగరంలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు.
 
ఇక నగర వ్యాప్తంగా నాన్‌వెజ్ అమ్మకాలను నిషేధించారు. మాంసాహారాన్ని అమ్మరాదని, కొనరాదని నిషేధాజ్ఞలు విధించారు. చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహార విక్రయాలను పూర్తిగా నిషేధించిన జిల్లా అధికారయంత్రాంగం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా రహస్యంగా అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 
 
క్రయ విక్రయాలకు సంబంధించి నిషేధంపై మైక్స్ ద్వారా ఇప్పటికే అన్ని డివిజన్లలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజలు, వ్యాపారులందరూ మాంసాహారానికి దూరంగా ఉండాలని అధికారులు చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 
 
అలాగే తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కరోనా వైరస్ లాక్ డౌన్ అమల్లో ఉంది మరియు రెడ్ జోన్లు నమోదు కావడం, నగరంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండుటకు ఆదివారం నాడు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో చికెను, చేపలు, మటను దుకాణాలు తెరువరాదని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
 
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో మటన్ పేరుతో జరుగుతున్న దందా వెలుగు చూసింది. పశుసంవర్థక శాఖ అధికారుల తనిఖీల్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. వ్యాపారులు మటన్ (గొర్రె, మేక మాంసం)లో బీఫ్ కలిపి అమ్ముతున్న విషయం బహిర్గతమైంది. మటన్-బీఫ్ మిక్సింగ్ మాఫియా గుట్టురట్టయింది.
 
లాక్ డౌన్ కొందరికి శాపంగా మారితే కొందరికి వరంగా మారింది. మటన్ వ్యాపారులు లాక్ డౌన్ ని క్యాష్ చేసుకుంటున్నారు. ధరలు బాగా పెంచి దోచుకుంటున్నారు. అదే సమయంలో మటన్ లో బీఫ్ కలిపి అమ్మకాలు జరుపుతున్నారు. ఇంకొందరు మటన్ షాపుల పేరుతో బీఫ్ అమ్మకాలు జరుపుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో జనాలు చికెన్ తినడం తగ్గించారు. 
 
చికెన్ తింటే కరోనా వస్తుందనే అపోహతో చికెన్ జోలికి వెళ్లడం లేదు. చికెన్ ప్రియులు సైతం మటన్ వైపు మొగ్గారు. దీంతో మటన్ కు డిమాండ్ పెరిగింది. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. మటన్ లో బీఫ్ కలిపి అమ్ముతున్నారనే వార్త మటన్ ప్రియులను కలవరపెడుతోంది. మటన్-బీఫ్ మిక్సింగ్ మాఫియాని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.