గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2019 (13:52 IST)

'మహా' టర్నింగ్ : ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఇవ్వండి.. సుప్రీంకోర్టు

మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మహారాష్ట్రలో ఆగమేఘాలపై బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఆదివారం అత్యవసరంగా విచారణ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అవకాశం లేకుండా ఈ రోజే బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తరపు న్యాయవాది కోరారు. 
 
అయితే, బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేల తరపున హాజరైన న్యాయవాది ముఖిల్ రోహిత్గి మాత్రం ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైవుందని గుర్తుచేశారు. పైగా, గవర్నర్ విచక్షణాధికారాలను ప్రశ్నిస్తారా అంటూ సందేహాన్ని లేవనెత్తారు. ఇరు తరపు వాదనలు ఆలకించిన సుప్రీం ధర్మాసనం మాత్రం మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
 
అంతేకాకుండా, ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌కు ఇచ్చిన మద్దతు లేఖలను తమకు సోమవారం ఉదయం 10.30లోగా సమర్పించాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే, మహారాష్ట్ర అసెంబ్లీ భాగస్వామ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. 
 
అలాగే, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుపై వివరాలు తెలపాలని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీఎం ఫడ్నవిస్, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ లకు నోటీసులు జారీ చేసింది. తమకు రేపు సొలిసిటర్ జనరల్ ఈ లేఖలు సమర్పించిన తర్వాత బలపరీక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని పేర్కొంటూ, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.