ఎన్నారై జయరామ్ మృతి కేసులో మేనకోడలు శిఖాచౌదరి ఆరా!
కోస్టల్ బ్యాంక్ ఎండీ, ఎన్నారై చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. జయరామ్ మేనకోడలు శిఖాచౌదరిపై అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అలాగే, హోటల్ దసపల్లాలో జయరామ్‍ను కలిసిన టీవీ యాంకర్ ఎవరన్నదానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ముఖ్యంగా అనుమానాస్పదంగా మృతి చెందిన జయరామ్ శరీరంపై తీవ్రమైన గాయాలు లేకపోవడం, తలపై చిన్న గాయం, ముక్కులో నుంచి రక్తం వచ్చినప్పటికీ గాయాల కారణంగా చనిపోలేదని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో ఫోరెన్సిక్ వైద్యులు తేల్చినట్టు తెలిసింది. అలాగే జయరాం శరీరం రంగు మారడంతో విషప్రయోగం జరిగి ఉంటుందని పోలీసులు బలంగా నమ్ముతున్నారు.
దీంతో పరీక్షల నిమిత్తం పలు శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. జయరాం హైదరాబాద్ దస్‌పల్లా హోటల్ నుంచి బయలుదేరినప్పటి నుంచి హత్య జరిగే వరకు రోడ్డుమార్గంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు నిశితంగా విశ్లేషిస్తున్నారు. మరోవైపు, జయరాం మృతదేహాన్ని శుక్రవారం పోస్టుమార్టంకు అప్పగించిన నందిగామ పోలీసులు.. అదేరోజు రాత్రి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు.
అమెరికాలో ఉన్న జయరాం భార్య పద్మశ్రీ, పిల్లలు ఆదివారం హైదరాబాద్ చేరుకొనే అవకాశం ఉంది. జయరాం భార్య, పిల్లలు వచ్చిన తర్వాతే అంత్యక్రియలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, అమెరికాలో విపరీతమైన మంచుకురుస్తున్న కారణంగా విమానసేవలు నిలిచిపోవడంతో జయరాం కుటుంబీకులు రావడం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదు.